మనసున్న మారాజు!

సాయం చేయాలంటే ధనవంతులే అయి ఉండనక్కర్లేదని, పెద్ద మనసుంటే చాలునని నిరూపించారు హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మట్టపల్లి గ్రామనివాసి సిరిపురం విశ్వనాథం. ఆపదలో ఉన్నవారికి ఐదువేలో పదివేలో సాయం చేయాలంటే ఐశ్వర్యవంతులు కూడా ఎంతో ఆలోచించే ఈ రోజుల్లో దాదా పు 78ఏండ్ల వయస్సున్న ఈ చిరువ్యాపారి మాత్రం ఏకంగా 50 లక్షల రూపాయలను.. అదికూడా తాను పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము నుంచి సైనిక సంక్షేమనిధికి విరాళంగా ఇచ్చి.. తన దేశభక్తిని, దాతృత్వా న్ని చాటుకున్నారు. సిరిపురం విశ్వనాథం ప్రస్తుతం మట్టపల్లిలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. భార్య, పిల్లలు లేని విశ్వనాథం.. చిరువ్యాపారం చేసుకుంటూ మొదటినుంచీ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇతరులకు తనవంతు సాయం అం దించేవారు. వ్యాపారంలో వచ్చిన కొంత లాభాన్ని పోగుచేసి సమాజంలో ఏదైనా మంచిపనికోసం ఉపయోగించాలని భావించిన విశ్వనాథం.. సైనికుల సంక్షేమనిధి గురించి తెలుసుకున్నారు. ఆ నిధికి కొంత సాయం చేయాలనుకుంటున్నానని హైదరాబాద్‌ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేశ్‌కుమార్‌కు తెలిపారు. దీంతో స్వయం గా వృద్ధాశ్రమానికి వచ్చిన శ్రీనేశ్‌కుమార్‌.. విశ్వనాథంను కలుసుకొన్నారు. తాను రూ. 50 లక్షలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్టు విశ్వనాథం చెప్పడంతో సైనిక సంక్షేమాధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయనను మర్యాదపూర్వకంగా రాజ్‌భవన్‌కు తీసుకెళ్లారు.


గవర్నర్‌ తమిళిసైసౌందర్‌ రాజన్‌ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి (ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే ఫండ్‌) చైర్‌పర్సన్‌గా ఉన్న గవర్నర్‌కు విశ్వనాథం రూ.50 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా విశ్వనాథం మాట్లాడుతూ.. తాను సామాజికసేవ కు ఎంతోకొంత సాయం చేయాలనుకున్నానని, సైనికుల సంక్షేమానికి ఏదైనా చేయాలనే కోరిక తనకు మొదటి నుంచి ఉన్నదని తెలిపారు. దేశంకోసం ప్రాణాలను సైతం త్యాగంచేసే సైనికులకు ఎంతచేసినా తక్కువేనన్నారు. పెద్దమనస్సుతో భారీ విరాళమి చ్చి, దేశభక్తిని చాటుకున్న విశ్వనాథాన్ని గవర్నర్‌ అభినందించారు. శాలువా కప్పి సత్కరించారు. విధి నిర్వహణలో, యుద్ధాల్లో వీరమరణం పొందిన, గాయపడిన సైనికుల కుటుంబాల సంక్షేమంకోసం ఒక సాధారణ వ్యక్తి ఇంత పెద్దమొత్తంలో విరాళమివ్వడం గొప్ప విషయమన్నారు. అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. భారీ విరాళం ఇచ్చిన విశ్వనాథానికి తెలంగాణ సైనిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ కర్నల్‌ రమేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ ప్రాంతీ య సైనిక సంక్షేమ అధికారి శ్రీనేశ్‌కుమార్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.