కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చిక్కుకుపోయిన వలస కార్మికులు శుక్రవారం రాత్రి వీధుల్లో బీభత్సం సృష్టించారు. తమను స్వస్థలాలకు చేర్చాలని అంటూ రోడ్డు మీద నిలిపిన తోపుడుబండ్లను ధ్వంసం చేశారు. అల్లర్లకు దిగిన పలువురు వలస కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్ వల్ల ఎక్కువగా ఎవరు నష్టపోయారు అంటే వలస కార్మికులే అని చెప్పాలి. పనికోసం ఊరుగాని ఊరు వచ్చి ఉంటున్నవారిది దిక్కుతోచని స్థితి. ఉన్నచోట ఉపాధి లేదు. పోనీ ఊరికి పోదామంటే బస్సులు, రైళ్లు లేవు. తిండికి కూడా తిప్పలే. చాలామంది గత్యంతరం లేక స్వగ్రామాలకు నడుచుకుంటూ వెళ్లారు. వారిలో ఎందరో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వలస కార్మికుల్లో అసహనం పెరిగిపోతున్నదని ఇది సూచిస్తున్నది.